Monday, September 7, 2015

విద్య ప్రభుత్వ బాధ్యత కాదు

విద్య ప్రభుత్వ బాధ్యత కాదు
-  కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలి
-  ప్రయివేటు వర్శిటీల బిల్లుకు కట్టుబడ్డాం
-  గురుపూజోత్సవంలో చంద్రబాబు
ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి
        'విద్య ప్రభుత్వ బాధ్యత కాదు. కార్పొరేట్లు సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్‌)గా తమ భుజస్కం ధాలపై వేసుకోవాలి. ఎక్కడైనా ఉన్నత విద్య అభివృద్ధి ఇలాగే జరిగింది. ప్రపంచం, దేశంలో యూనివర్శిటీల అభివృద్ధికి నమూనా ఇదే. హార్వర్డ్‌ యూనివర్శిటీయే ఇందుకు ఉదాహరణ. దీనికోసం ప్రయివేటు దాతలంతా 'కార్పస్‌' ఫండ్‌ ఏర్పాటు చేయాలి. ప్రయివేటు యూనివర్శిటీల బిల్లును అసెంబ్లీలో తీర్మానించాం. కేంద్రానికి పంపాం. ఆమోదం కూడా లభిస్తుందని ఆశిస్తున్నాం..' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య విషయంలో ప్రభుత్వ బాధ్యతకు తిలోదకాలిచ్చే ప్రయత్నం చేశారు. శనివారం సాయంత్రం విశాఖపట్నంలోని ఎయు ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి టీచర్స్‌డేను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రా యూనివర్శిటీకి గొప్ప చరిత్ర ఉందని, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సిఆర్‌ రెడ్డి ఇక్కడ విసిలుగా పనిచేయడం అదృష్టమని అన్నారు. 719 యూనివర్శిటీల్లో ఎయుకు 8వ స్థానం లభించడం అభినందనీయమని కొనియాడారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లడం వల్ల చైనా, జపాన్‌, అమెరికా వంటి దేశాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మన దేశంలోనే నాణ్యమైన విద్యకు బాటలు వేయాలని అన్నారు. ప్రాథమిక విద్య అత్యంత దారుణంగా ఉందని పేర్కొంటూ.. కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని దేశంలో 35 రాష్ట్రాలుంటే మనది 31వ స్థానమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా టీచర్‌ పోస్టు ఖాళీ ఉండే ప్రసక్తి లేకుండా చర్యలు తీసుకుంటానని, మౌలిక వసతులకు ఢోకా లేకుండా చేస్తానని తెలిపారు. అన్ని పాఠశాలల్లో టారులెట్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ప్రధానోపాధ్యాయులకు ఐపాడ్‌లు ఇస్తామని, టీచర్లకు సైతం విస్తరిస్తామని తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలో శత శాతం అక్షరాస్యత సాధించాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. టీచర్లు ఎవ్వరూ రాజకీయ నాయకుల చుట్టూ తిరగకూడదనే కౌన్సిలింగ్‌ విధానం పెట్టి బదిలీలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో వంద కళాశాలలను టాటా సంస్థ దత్తత తీసుకుని వేలాది మంది విద్యార్థులను అభివృద్ధి చేసేందుకు ఎంఒయు కుదిరిందన్నారు. ఫిబ్రవరిలో విశాఖలో నేవీ ఫ్లీట్‌ జరగనుందని, 60 నుంచి 70 దేశాలు రాబోతున్నాయని తెలిపారు. జనవరిలో పారిశ్రామిక వేత్తల కాన్ఫెడరేషన్‌ విశాఖలో నిర్వహిస్తామన్నారు. త్వరలో రూ. 3,500 కోట్లతో సీమెన్‌ సంస్థ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పనల అభివృద్ధి కోసం నిధులు వెచ్చిస్తోందని, దీంట్లో రూ. 350 కోట్లు అంటే పది శాతం ప్రభుత్వం తరపున సమకూరుస్తున్నామని తెలిపారు. తరువాత రాష్ట్ర, జిల్లా స్థాయిలో 158 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు చంద్రబాబు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎయు విసి ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు, రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎంపీ హరిబాబు, కలెక్టర్‌ యువరాజ్‌, విద్యాశాఖ ఉన్నతాధికారి బి.ఉదయలక్ష్మి, సిసోడియా, టిఇఎస్‌ఎస్‌ సంస్థ అధినేత పరశురాం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బాబు ఎంట్రీతోనే సభలో షార్ట్‌ సర్క్యూట్‌
వేడుకల ప్రాంగణంలోకి చంద్రబాబు అడుగుపెడుతున్న సమయంలో ప్రెస్‌, అవార్డుల గ్యాలరీల వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేశారు. లైట్లను కూడా ఆపేశారు. సాయంత్రం 3 గంటలకు రావాల్సిన ముఖ్యమంత్రి 5.30 గంటలకు వచ్చారు. ఉదయం 10.30 గంటలకే విద్యార్థులను తీసుకురావడంతో వారిలో అనేక మంది మధ్యాహ్నం తిండిలేక అలసటకు గురై కూర్చొన్నచోటే నిద్రపోవడం కనిపించింది.

No comments:

Post a Comment