ముసాయిదా పోస్టాఫీస్ బిల్లు-2011'
తపాలా విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్) కేంద్ర మంత్రి మండలి ఆమోదానికై 'ముసాయిదా పోస్టాఫీస్ బిల్లు-2011'ని పంపింది. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపే యాభై గ్రాముల బరువు ఉన్న ఉత్తరాలకు పోస్టాఫీసు వసూలు చేసే చార్జీకి, అంతే బరువు ఉన్న లేఖల బట్వాడాకు కొరియర్ కంపెనీలు విధిగా రెట్టింపు వసూలు చేయాలని ఆ ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది.
స్పీడ్ పోస్ట్ చార్జి ప్రస్తుతం రూ.25. ఈ దృష్ట్యా కొరియర్ కంపెనీలు యాభై గ్రాముల బరువు ఉన్న లేఖలను బట్వాడా చేయడానికి కనీస చార్జిగా రూ.50 వసూలు చేయవలసి వుంటుంది. ప్రైవేట్ సంస్థలపై ఇటువంటి నిబంధనలు విధించడం ప్రభుత్వ ఆధ్వర్యంలోని తపాలా విభాగానికి గొప్ప సహాయకారి అవుతుందని భావనతోనే ఆ ప్రతిపాదన చేశారు. పోస్టాఫీసు బట్వాడా కొరియర్ కంపెనీల బట్వాడా కంటే చౌకగా జరుగుతుంది కదా. కొరియర్ కంపెనీలపై ఈ ఆంక్షను పదిహేనేళ్ళ తరువాత ఎత్తివేయాలని ఆ ముసాయిదా బిల్లు పేర్కొంది.
కొరియర్ కంపెనీలపై కనీస చార్జీల నిబంధనను విధించడం హేతుబద్ధమేనా? ఎంత మాత్రం కాదు. తపాలా సేవల వ్యయాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. మెట్రోపాలిటన్ నగరాలలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడం ద్వారా మౌలిక సదుపాయాల నిర్వహణా వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే విధానాన్ని తపాలా రంగంలో కూడా వర్తింప చేయాలి.
ఏమైనా అటువంటి నిబంధనలను అమలుపరచడం కష్టసాధ్యం. చిన్న కొరియర్ కంపెనీలు ఖాతాదారులకు రూ.50కి రసీదు ఇచ్చి వారి నుంచి రూ.30లే వసూలు చేయవచ్చు. ఇలా, చట్టాన్ని ఉల్లంఘించేందుకు ప్రజలకు ప్రభుత్వమే ప్రోత్సాహం సమకూర్చడమవుతుంది. పోస్టాఫీసుల చార్జీకి రెట్టింపు చార్జీని వసూలు చేయాలనే నిబంధన చిన్న చిన్న కొరియర్ కంపెనీల ప్రయోజనాలకు చాలా హాని కల్గిస్తుందనడంలో సందేహం లేదు. పెద్ద పెద్ద కొరియర్ కంపెనీలు ఇప్పటికే యాభై గ్రాముల బరువు ఉన్న లేఖ బట్వాడాకు రూ.40 నుంచి రూ.100 దాకా వసూలు చేస్తున్నాయి.
ప్రతిపాదిత చట్టం వాటినేమీ ప్రతికూలంగా ప్రభావితం చేయదు. చిన్న కొరియర్ కంపెనీలు ఇప్పుడు కనీస చార్జీగా రూ.25 నుంచి రూ.40 దాకా వసూలు చేస్తున్నాయి. ముసాయిదా బిల్లు ప్రతిపాదించిన ఆంక్షల వల్ల ఈ చిన్న సంస్థలు భారీగా నష్టపోతాయి. దేశ ప్రయోజనాలకు ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. భారత ప్రభుత్వ తపాలా విభాగం దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో సైతం గ్రామీణ ప్రా ంతాల్లో పోస్టాఫీసులను నిర్వహిస్తోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం వాటి నిర్వహణా వ్యయం కంటే చాలా తక్కువగా ఉంటోంది. ఇక కొరియర్ కంపెనీలు నగరాల ప్రజలకు మాత్రమే సేవలందిస్తున్నా యి.
గ్రామీణ ప్రజలకు సేవలందిస్తున్న తపాలా విభాగం నిర్వహణా వ్యయం అధికంగా ఉంటోంది కనుక ఆ విభాగానికి నష్టపరిహారాన్ని తప్పక ఇవ్వవల్సిందే. ఇందులో సందేహం లేదు. అయితే, టెలీకాం కంపెనీలపై విధించినట్లుగా కొరియర్ కంపెనీలపై 'సౌలభ్యతా లోటు చార్జీ' (ఎక్సెస్ డెఫిసిట్ చార్జ్)ని విధించడం ద్వారా వచ్చే రాబడితో తపాలా విభాగానికి నష్టపరిహారాన్ని సమకూర్చవచ్చు. మెట్రోపాలిటన్ నగరాలు, రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో సేవలందిస్తున్న సంస్థలుగా కొరియర్ కంపెనీలను వర్గీకరించాలి.
సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించి, తపా లా విభాగంతో పాటు వీటికి కూడా సబ్సిడీ సదుపాయాన్ని కల్పించా లి. దీని వల్ల కొరియర్ కంపెనీలు చిన్న పట్టణాల, గ్రామీణ ప్రజలకు మరింతగా సేవలు అందించే అవకాశం ఉంది. తద్వారా ఆర్థికాభివృ ద్ధి ఫలితాలు ఆ ప్రాంతాలకూ శీఘ్రగతిన అందడానికి అవి దోహదం చేస్తాయి. చిన్న పట్టణాలలో కొరియర్ సేవలను వినియోగించుకోవ డం ఎంతగా పెరిగితే తపాలా విభాగం నష్టాలు అంతగా తగ్గుతాయి. ఈ నమూనాను మొబైల్ టెలీఫోన్‌లో విజయవంతంగా అమలుపరిచాము. నగరప్రాంతాలలో అందిస్తున్న సేవలపై ప్రైవేట్ టెలీకాం కంపెనీలు ఎక్సెస్ డెఫిసిట్ చార్జీలను చెల్లిస్తున్నాయి.
గామీణ ప్రాంతాల వారికి అందిస్తోన్న సేవలకుగాను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వం నుంచి సబ్సిడీలను పొందుతోంది. గ్రామీణ ప్రాంతాలలో సేవలందించిన పక్షంలో ప్రైవేట్ సంస్థలు కూడా సబ్సిడీని పొందడానికి అర్హమవుతాయి. ఈ సదుపాయాన్ని వినియోగించు కోవడానికి ప్రైవేట్ సంస్థలు బాగా పోటీపడుతున్నాయి. మారుమూలపల్లె ప్రజలకు కూడా ఇప్పుడు అత్యాధునిక టెలీకాం సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మరో వైపు బిఎస్ఎన్ఎల్ మరింత మెరుగైన సేవలనందించడానికి ప్రయత్నిస్తోంది. తపాలా సేవలకు కూడా టెలీకాం నమూనాను వర్తింపచేయాలి.
చాలా దేశాలలో ఉత్తరాల బట్వాడాపై తపాలా విభాగాలకే గుత్తాధిపత్యం ఉందని ఆ ముసాయిదా బిల్లు రూపకర్తలు పేర్కొన్నారు. మనదేశంలో కూడా ఆ ప్రామాణిక విధానాన్నే కొనసాగించాలనేది వారి వాదన. అయితే వారి వాదన పాక్షికంగా మాత్రమే సత్యం. ఇంగ్లండ్‌లో 350 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న ఉత్తరాల బట్వాడాపై మాత్రమే తపాలా విభాగానికి పూర్తి ఆధిపత్యం ఉందని సివిల్ సొసైటీ ఎక్స్ఛేంజ్ తన వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. అలాగే ఆస్ట్రేలియాలో 250 గ్రాములకంటే తక్కువ బరువు ఉన్న ఉత్తరాల బట్వాడాకు మాత్రమే తపాలా విభాగం పరిమితమవుతుంది.
నెదర్లాండ్స్, జర్మనీలలో అయితే కేవలం 50 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న ఉత్తరాలను మాత్రమే ఆయా దేశాల తపాలా విభాగాలు బట్వాడా చేస్తున్నాయి. న్యూజిలాండ్‌లో ఎంత బరువు ఉన్న ఉత్తరాలనైనా ప్రభుత్వ తపాలా విభాగమే బట్వాడా చేస్తోంది. జపాన్ తన తపాలా సేవలను పూర్తిగా ప్రైవేటీకరించాలని యోచిస్తోంది. అత్యాధునిక సాంకేతికతల ఆవిర్భావంతో తపాలా బట్వాడాకు కాలదోషం పట్టింది. ఉత్తరం రాసి పోస్ట్‌లో వేయడం కంటే సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడుకోవడమే అన్ని విధాలా సుకరంగా ఉంటోంది. ఈ-మెయిల్‌తో అనేక ఉత్తరాలు పంపే బాధ తొలగిపోయింది. ఆదాయాన్ని సుస్థిరం చేసుకొని లాభాలను ఆర్జించడానికిగాను తపాలా విభాగం ఆర్థిక ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తోంది.
త్వరలో దేశవ్యాప్తంగా 4000 పోస్టాఫీసుల్లో 'మౌలిక బ్యాంకింగ్ సేవల' (కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్-సిబిఎస్)ను అందించనున్నారు. దీని వల్ల ఒక బ్యాంక్ చెక్‌ను ఏ సిబిఎస్ పోస్టాఫీసులోనైనా నగదుగా మార్చుకునే సదుపాయం లభించనున్నది. ఇది సరైన దిశలో వేసిన ముందడుగు. కొరియర్ వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించకుండా పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలనందించే సదుపాయాలను కల్పించడానికి తపాలా విభాగం ప్రాధాన్యమివ్వాలి. ఒక పది సంవత్సరాల అనంతరం తపాలా విభాగానికి గ్రామీణ బ్యాంకింగ్ విభాగంగా పునఃనామకరణం చేయడం అనివార్యమేమో!
No comments:
Post a Comment